NTV Telugu Site icon

Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!

Dead

Dead

The body has been in the house for a week: కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినా.. తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. ఎప్పటిలానే వారు సాధారణ జీవితం గడిపారు. దుర్వాసన వస్తుండగా.. పక్కింటి యువకులు లోపలి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని చింతల్‌లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ముక్కు రాధాకుమారి (45) 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చింతల్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాధాకుమారి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి ఆమె సోదరుడు పవన్‌, తల్లి విజయలక్ష్మితో కలిసి చింతల్‌లోనే ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాధాకుమారికి వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. రెండేళ్లుగా ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

రాధాకుమారి సోదరుడు పవన్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. తల్లి మానసిక స్థితి బాగోలేక పోవడం, అక్క అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. ఇద్దరినీ ఆయనే చూసుకుంటున్నారు. అయితే పవన్‌ మానసిక స్థితి కూడా క్షీణించడంతో రెండు నెలల క్రితం కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తరచూ బయటకు వచ్చే పవన్‌.. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. వారం రోజుల క్రితం సోదరి రాధాకుమారి మరణించినా గుర్తించలేదు. రోజులు గడిచినా సోదరి మృతి చెందినట్లు పవన్‌ గుర్తించలేక పోయాడు.

Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

అప్పుడప్పుడు పవన్‌ బైక్ తీసుకునే పక్కింట్లో ఉండే యువకులు మంగళవారం రాత్రి ఇంటి తలుపు తట్టారు. పవన్ తలుపులు తీయడంతో.. వారికి తీవ్ర దుర్వాసన వచ్చింది. ఏంటని ఇంటి లోపలికి వెళ్లిచూడగా.. మంచంపై రాధాకుమారి మృతిచెంది ఉంది. మీ అక్క చనిపోయిందని చెప్పినా.. పవన్ స్పందించలేదు. దాంతో యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు ఇంటికి వచ్చి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.