Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..

Chahal

Chahal

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీలో చేరిన వెంటనే బీజేపీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు చాహల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చాలో ఈ నూతన నియామకాలు జరిగాయని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని అమర్‌పాల్ మౌర్య తెలిపారు.

ఈ నియామకాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి. అసోంకు చెందిన జోగెన్ మోహన్, ఒడిశాకు చెందిన మమతా మొహంతా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగం లాల్ గుప్తా, సంగీతా బల్వంత్ బింద్, మహారాష్ట్రకు చెందిన బాబన్‌రావు రావ్‌జీ చౌదరి, ఢిల్లీకి చెందిన సత్ ప్రకాష్ రాణా, బీహార్‌కు చెందిన అర్జున్ సాహ్నిలను ఓబీసీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ఢిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్, కర్ణాటకకు చెందిన ప్రమోద్ మధ్వరాజ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లలిత్ చంద్రకర్‌లను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

వీరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఏడుగురు జాతీయ కార్యదర్శులను, 37 మంది జాతీయ కార్యవర్గ సభ్యులను కూడా పార్టీ ప్రకటించింది. కొత్తగా నియమితులైన ఏడుగురు జాతీయ కార్యదర్శులలో తెలంగాణకు చెందిన కడగంచి రమేష్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు గుజరాత్ నుంచి దశరథ్‌జీ ఠాకూర్, తమిళనాడు నుంచి టి. వరదరాజన్, జార్ఖండ్ నుంచి సంజీవ్ కుమార్, హర్యానా నుంచి సరితా జాంగిడ్, మధ్యప్రదేశ్ నుంచి వైభవ్ పన్వార్, బీహార్ నుంచి భీమ్ కుమార్ సాహు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

1990లో జన్మించిన యుజ్వేంద్ర చాహల్, భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో లెగ్ స్పిన్నర్‌గా రాణించారు. క్రికెట్‌లోకి రాకముందు ఆయన చెస్ క్రీడాకారుడిగా కూడా పోటీల్లో పాల్గొన్నారు. టీ20 క్రికెట్ చరిత్రలో 400 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చాహల్ అరుదైన రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లాండ్‌పై 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడారు. 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఆయనను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు ప్రాతినిధ్యం వహించే చాహల్, ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో కెంట్, నార్తాంప్టన్‌షైర్ జట్ల తరపున కూడా ఆడారు.