Sachin Tendulkar recognised as National Icon of EC: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం నియమితులయ్యారు. ముఖ్యంగా పట్టణ మరియు యువత ఓటింగ్ పెంచేందుకు ప్రచారకర్తగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేడు ఢిల్లీలో సచిన్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ పని చేయనున్నారు.
నియామకం అనంతరం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మన ఓటు హక్కును వినియోగించుకోవడం మన ప్రధాన బాధ్యత అని అన్నారు. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలని తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
2024లో అక్టోబరు-నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికలలో ఎక్కువ మంది ఓటర్లు భాగస్వామ్యం అయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించింది. సచిన్ నయా ఇన్నింగ్స్ నేటితో షురూ అయింది. క్రికెట్‌లో వంద సెంచరీలు, ఎన్నెన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సచిన్.. ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు రంగంలోకి దిగారు.
Also Read: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఈసీ పలు రంగాలకు చెందిన ప్రముఖ భారతీయులను ‘నేషనల్ ఐకాన్’గా పేర్కొంటుంది. గత సంవత్సరం నటుడు పంకజ్ త్రిపాఠిని ఈసీ నేషనల్ ఐకాన్‌గా పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్ వంటి సెలబ్రెటీలను నేషనల్ ఐకాన్‌గా ఈసీ గుర్తించింది. ఈసారి ఈ బాధ్యతను సచిన్ టెండూల్కర్‌కు అప్పగించింది.