Site icon NTV Telugu

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

Delhi Capitals

Delhi Capitals

Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్‌లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్‌లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే అక్షర్ శైలి, సుదీర్ఘమైన ఈ టోర్నమెంట్‌లో జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మనోడికి తోడుగా కుల్దీప్ యాదవ్ ఉండటంతో, ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన స్పిన్ జోడి ఢిల్లీ సొంతమైంది.

READ ALSO: Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్‌ డిపాజిట్‌.. నిబంధనలు విత్‌డ్రా..!

బలమైన బ్యాటింగ్ ఆర్డర్
కాగితంపై చూస్తే ఢిల్లీ బ్యాటింగ్ లైన్-అప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. జట్టుకు టాప్ ఆర్డర్‌లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వెన్నెముకలా నిలుస్తున్నాడు. గత సీజన్‌లో 539 పరుగులతో అదరగొట్టిన రాహుల్, ప్రస్తుతం రంజీల్లో వరుస సెంచరీలతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే.. డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి హిట్టర్లు ఉండటం జట్టుకు కొండంత అండ. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా వీరి సొంతం. తర్వాత స్థానాల్లో యువ ఆటగాళ్లు నితీష్ రాణా, పతుమ్ నిస్సంకలు జట్టుకు అవసరమైన ముగింపును అందించడంలో ముందుంటున్నారు.

అయితే ఈసారి ఢిల్లీ జట్టు తన బౌలింగ్‌పైనే ఎక్కువ నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. జట్టులోకి మిచెల్ స్టార్క్ రావడం బౌలింగ్ దాడి స్వరూపాన్నే మార్చేసింది. ఆరంభంలోనూ, డెత్ ఓవర్లలోనూ అతను బ్యాటర్లకు సింహస్వప్నం. నియంత్రణతో బౌలింగ్ చేయడంలో లుంగి ఎన్గిడి, టీ నటరాజన్ దిట్టగా పేరు సంపాదించుకున్నారు. అఖిబ్ నబీ వంటి బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. అన్నీ బాగున్నా, ఢిల్లీని ఎప్పుడూ వేధించే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కీలక సమయంలో ఆటగాళ్లు గాయపడటం ఢిల్లీకి పాత అలవాటే. ప్రస్తుతం స్టార్క్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం వారి గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్నిసార్లు మైదానంలో కంటే కాగితంపైనే ఈ జట్టు మెరుగ్గా కనిపిస్తుంది. ఒత్తిడి సమయాల్లో సంయమనం కోల్పోకుండా ఆడటమే ఇప్పుడున్న జట్టు ముందున్న పెద్ద సవాలుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఓపెనర్ బెన్ డకెట్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై మేనేజ్మెంట్ దృష్టి సారించాల్సి ఉంది. గత సీజన్ల చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, ఆటగాళ్లందరూ నిలకడగా రాణిస్తే ఈసారి ఢిల్లీ ఫ్యాన్స్ ఐపీఎల్ కప్ గెలిచే కల నెరవేరడం అసాధ్యమేమీ కాదు.

DC సాధ్యమయ్యే ప్లేయింగ్ XI (అంచనా):
కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (C), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్.
(ఇంపాక్ట్ ప్లేయర్: టి నటరాజన్)

READ ALSO: Fuel Price Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒక లీటరు ధర ఎంతంటే!

Exit mobile version