Takkar Movie : `నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరో సిద్దార్థ్. ఆయన కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు `టక్కర్` సినిమాతో వస్తున్నాడు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిద్దార్థ్ సరసన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే నెల 9న తెలుగు, తమిళంలో ఏక కాలంలో సినిమా విడుదల కాబోతుంది.
Read Also: Revanth Reddy: రేవంత్ రెడ్డికి హెచ్‌ఎండీఏ లీగల్ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే..
‘టక్కర్’ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనిపిస్తోంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఊపిరే’ అంటూ సాగే మూడో పాట విడుదలైంది. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. అభయ్ జోధ్‌పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను మధురంగా ఆలపించారు. `సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే` అంటూ కథానాయికపై హీరోకి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. తేలిక పదాలతో లోతైన భావం పలికించారు కృష్ణకాంత్. నాయకా నాయికల మధ్య మొహాన్ని తెలిపేలా అద్భుతమైన సాహిత్యంతో పాట సాగింది. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగానే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది.
Read Also: Visa ban: భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల రిజెక్ట్