Ramakrishna: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆమె.. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారట.. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.. ఆమెతో పాటు సుమారు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.. అయితే, వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.
Read Also: Municipal Staff Strike: మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
ఇక, ఫిబ్రవరి నెలాఖరులో మా ఎత్తులు, పొత్తులు తేలుతాయన్నారు రామకృష్ణ.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అని మండిపడ్డారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలే లిక్కర్ స్కాం ఏపీలో జరుగుతోందని లెటర్ ఇచ్చినా ప్రొసీడ్ కాలేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో కిందిస్ధాయి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.06 లక్షల అంగన్వాడీ వర్కర్ల నిరసన ధర్నాను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అయితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అంగన్వాడీల కలెక్టరేట్ల దిగ్బంధన కార్యక్రమానికి సీపీఐ మద్దతిచ్చి పాల్గొంటుందని ప్రకటించారు. మరోవైపు.. 11 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మరో 2 వేల కోట్ల అప్పు చేస్తే ఏమైనా పోతుందా? అని ప్రశ్నించారు రామకృష్ణ.. బైజూస్ కంపెనీ రూ.9200 కోట్ల మనీలాండరింగ్ లో ఉన్న కంపెనీ.. బజాజ్ ఫైనాన్స్ తో టైఅప్ చేసుకుని బైజూస్ విద్యార్ధులను దోచుకుంటోందని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.