విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!
పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు కొన్నిరోజులుగా ఆరోగ్యం బాలేదు. ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించిన వైద్యులు పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయ డయాగ్నోస్టిక్స్ విశాఖపట్నంలో జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. అయితే బాధితురాలు కోలుకుంది. ఈ సాయంత్రానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.