స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. స్వాతి మలివాల్ పై దాడి ఘటనలో అరెస్టైన ఆయన తీస్ హజారీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ పై విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ జడ్జి సుశీల్ అనుజ్ త్యాగి అతడికి బైయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
READ MORE: Saudi Arabia–Syria: సిరియాతో దోస్తీకి సౌదీ అరేబియా సై..12 తర్వాత సంబంధాల పునరుద్ధరణ
కాగా..దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌పై నేడు హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా అతడి లాయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే దాడి జరిగినట్లు మహిళా ఎంపీ చెబుతున్నారని ఆరోపించారు. అక్కడ రికార్డింగ్ సాధనాలు లేవన్న విషయం ఆమెకు తెలుసునన్నారు. మే 13న ఆమె సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణే అని కోర్టుకు వెల్లడించారు. ఎంపీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంట్లోకి ఆ రకంగా ప్రవేశించే అనుమతి ఇచ్చినట్లు కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె సమస్యలు సృష్టించారని చెప్పారు. ఈ ఆరోపణలను విన్న మాలీవాల్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక తన వాదనలు వినిపించే సమయంలో ఆమె పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటినుంచి భాజపా ఏజెంటని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ట్రోల్ ఆర్మీ తనను వేధిస్తోందని పేర్కొన్నారు. వరుసగా ప్రెస్‌మీట్లు ఏర్పాటుచేసి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బిభవ్ కుమార్ సామాన్య వ్యక్తి కాదని గుర్తు చేశారు. గతంలో ఆప్ వాలంటీర్‌గా పనిచేసిన ఓ యూట్యూబర్ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్టు చేసిన నాటినుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. బిభవ్‌కుమార్‌కు బెయిల్ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు.