మంచిర్యాల జిల్లాను కరోనా విడిచి పెట్టడం లేదు. వారం రోజుల్లోనే 650కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజు 60 నుంచి 120 కేసులు నమోదు అవుతున్నాయి. బెల్లంపల్లి మండలం ఆకినెపల్లిలో మూడు రోజుల వ్యవధిలోనే 29 మందికి కరోనా సోకింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు ఆయన కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు. జనం కరోనా తగ్గిపోయిందని మాస్కులు లేకుండానే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సైతం కొవిడ్ నిబంధనలు అమలు చేయటం లేదు. జిల్లాలో ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ ఎక్కువగానే ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చిపోతుంటారు.
అక్కడి నుంచి జనం రాకపోకలు సాగించటం వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల 34 వేల154 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 44 వేల784 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1329 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కాటుకు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. బెల్లంపల్లి సహా జిల్లాలోని పలు మండలాల్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఫంక్షన్లు..ఇతర రాష్ట్రాలకు వెళ్లి మళ్లీ ఇక్కడికి రాగానే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. ఇంకా మహారాష్ట్ర భయం నుంచి తేరుకోలేదు. కరోనా పోయిందనే అభిప్రాయం నుంచి జనం బయటకు రావటంలేదు. అధికారులు సైతం కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే జిల్లాలో కొవిడ్ మరింత విజృంభించే ప్రమాదం ఉంది.