Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కబాబ్ లు రుచిగా లేవన్న కారణంతో వాటిని చేసిన కుక్ ను కొందరు కాల్చిచంపారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. బరేలీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రియదర్శిని నగర్‌లో ఉన్న ఓ పాత కబాబ్ దుకాణంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సిటీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ భాటి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు బుధవారం రాత్రి దుకాణానికి విలాసవంతమైన కారులో వచ్చారు. అప్పటికే వారు ఫుల్ గా తాగి మత్తులో ఉన్నారు. కబాబులు రుచిగా లేవని.. తమకు నచ్చడం లేదని దుకాణ యజమాని అంకుర్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేశారు.
Read Also:Supreme Court : రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ .. విచారణ ప్రొసీడింగ్స్ కి స్వస్తి
ఈ విషయంలోనే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు అంకుర్ సబర్వాల్‌పై దాడి చేసి, డబ్బులు ఇవ్వకుండా తమ కారు వద్దకు వెళ్లారు. దీంతో అంకుర్ సబర్వాల్ వారి నుండి రూ.120 వసూలు చేసుకుని రమ్మని నసీర్ అహ్మద్ ను పంపించాడు. దగ్గరకి వస్తున్న నసీర్ ను వారిలో ఒకరు తుపాకీతో కాల్చాడు. దీంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి పరారయ్యారు. కాగా, ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది వారు వచ్చిన కారు ఫొటోలు తీశారు. ఈ ఫొటోల ఆధారంగా కారు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ కు చెందినదిగా పోలీసులు తెలిపారు. “కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి హంతకులను గుర్తించాం. పోలీసులు గుర్తు తెలియని దుండగులపై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు” అని పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ భాటి తెలిపారు.
Read Also:Karnataka Elections: కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం.. ఏ పార్టీ తరుపున అంటే..?