Question on Sanju Samson in KBC 16: టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్రశ్నకు జవాబు చెప్పలేదు. రెండు లైఫ్‌లైన్‌లు వినియోగించుకున్నప్పటికీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం సంజూనే కావడం ఇక్కడ విశేషం.
కేబీసీ 16కు వ్యాఖ్యాతగా అమితాబ్ బచ్చన్ వ్యవరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో రామ్ కిషోర్ అనే కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ‘ఐపీఎల్ 2024లో కెప్టెన్‌లుగా ఉన్న ఈ ఆటగాళ్లలో భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడని ప్లేయర్ ఎవరు?’ అని కిషోర్‌ను అమితాబ్ అడిగారు. ఆప్షన్‌గా ఎ-శ్రేయస్ అయ్యర్, బి-హార్దిక్ పాండ్యా, సి-సంజు శాంసన్, డి-రిషబ్ పంత్ పేర్లను ఇచ్చారు. ఈ ప్రశ్నకు కిషోర్ సమాధానం చెప్పలేదు. ఆడియన్స్ పోల్ ఉపయోగించుకున్నా ఆన్సర్ చెప్పకపోవడంతో అమితాబ్ మరో లైఫ్‌లైన్ (ఫోన్ ఎ ఫ్రెండ్, డబుల్ డిప్) ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.
Also Read: Gold Rate Today: పండగ వేళ పెరిగిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
రామ్ కిషోర్ తన స్నేహితుడికి కాల్ చేసే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అయినా ఫలితం లేదు. డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ను ఎంచుకొని.. శ్రేయస్ అయ్యర్ పేరును సమాధానంగా ఎంచుకున్నారు. కంప్యూటర్ స్క్రీన్ అది తప్పుడు సమాధానం అని చెప్పింది. కిషోర్ రెండు లైఫ్‌లైన్లు ఉపయోగించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సంజు శాంసన్. ఇప్పటివరకు భారత్ తరఫున 16 వన్డేలు, 30 టీ20లు ఆడిన సంజూ.. ఇంకా టెస్టుల్లోకి అరంగేట్రం చేయలేదు. కేబీసీ కారణంగా శాంసన్ పేరు ట్రెండ్ అవుతోంది. ‘సంజూ ఎంతపని చేశావయ్యా’ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.