పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆలస్యంగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్‌పై అతని భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కొడవలితో పీక కోసేందుకు యత్నించినట్లు బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మొక్కజొన్న పంటకు మందు కొడదామని చెప్పి భర్తను పొలానికి తీసుకెళ్లిన ఈశ్వరమ్మ, అక్కడే ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, ఆయన భార్యకు పాక్‌తో సంబంధాలు.. సీఎం సంచలన ఆరోపణలు..
అదే సమయంలో అటుగా కొందరు రావడంతో ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు, తమ్ముడు జొన్న పంటలో దాక్కోగా, కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గాయాలపాలైన కుమార్ గత రెండు రోజులుగా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యాభర్తల మధ్య గతంలో రెండు సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు బంధువులు చెబుతున్నారు. అలాగే భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భార్య ఈశ్వరమ్మ భూమిని తన పేరు మీద రాయించుకుంది. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
