Jaswant Singh: రాజస్థాన్‌లోని అల్వార్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేలో జరిగిన ఈ ప్రమాద సమయంలో కారులో మన్వేంద్ర సింగ్, అతని భార్యతో పాటు, వారి 25 ఏళ్ల కుమారుడు హమీర్ సింగ్, వారి డ్రైవర్ ఉన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం, వాహనాన్ని నడుపుతున్న తన భర్త పక్కనే చిత్ర ప్రయాణీకుల సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో మన్వేంద్ర కొడుకు, డ్రైవర్ ఉన్నారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదు. ప్రమాదం తాకిడికి కారు విండ్‌స్క్రీన్ తీవ్రంగా దెబ్బతింది.
Read Also: Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం
మన్వేంద్ర సింగ్ 2004-2009 మధ్య లోక్‌సభ సభ్యుడు. రాజస్థాన్‌లోని బార్మర్-జైసల్మేర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి జస్వంత్ సింగ్ రాజకీయ ప్రముఖుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన 2020లో మరణించారు. జస్వంత్ సింగ్ మొదటి ఎన్డీయే ప్రభుత్వంలో అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఆయన ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను కూడా నిర్వహించారు.