Site icon NTV Telugu

Narendra Modi: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవలేదు..!

Pm Modi

Pm Modi

Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 స్థానాల్లో కూడా గెలవదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా హస్తం పార్టీ కోల్పోతుందని పేర్కొన్నారు. ఒడిశాలోని కందమాల్‌లో ఇవాళ (శనివారం) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేపట్టిన పోఖ్రాన్ పరీక్షలు వరల్డ్ వైడ్ గా భారతదేశ ప్రతిష్టను పెంచాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా 500 ఏళ్ల ప్రజల నిరీక్షణకు బీజేపీ సర్కార్ తెరదించిందని వెల్లడించారు. ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుంది.. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వారినే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Read Also: CM YS Jagan: రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది..

ఇక, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ను గౌరవించండి అని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రధాని మోడీ రియాక్ట్ అయ్యారు. ఆర్థిక సమస్యల కారణంగా భారత్‌కు దూరమైన దాయాది దేశం తన అణ్వాయుధాలను విక్రయించాలని చూస్తోందని చెప్పారు. పాకిస్తాన్ అణు బాంబులతో భారత ప్రజలను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. కాగా, పాక్‌లో అణుబాంబులు ఉన్నాయని హస్తం పార్టీ చెబుతోంది.. కానీ ఆ బాంబును ఎలా నిర్వహించాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ బాంబులను అమ్మడానికి వారు ప్రయత్నిస్తున్నారు.. అలాగే, కాంగ్రెస్ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని భరించవలసి వచ్చిందని ప్రధాన మంత్రి మోడీ ఆరోపించారు.

Exit mobile version