Janga Raghava Reddy: కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని.. ప్రజలు నన్ను గెలిపియ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వినికి టికెట్లు ఇచ్చారని.. నాకు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మీటింగ్స్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని జంగా పేర్కొన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి ఒక బ్రోకర్.. అసమర్థుడు అంటూ విమర్శలు గుప్పించారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. ఏ సర్వే ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నాయకులు సిద్ధంగా లేరన్నారు. తనపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. స్వలాభం కోసం పార్టీని నాశనం చేయొద్దన్నారు.
Also Read: Babu Mohan: ఈసారి పోటీ చేయడం లేదు.. బీజేపీకి రాజీనామా చేస్తా: బాబు మోహన్
కాంగ్రెస్‌ను మోసం చేయలేదని, ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద నేను ప్రమాణం చేస్తా, నాయిని సిద్ధమా అంటూ జంగా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. 6 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు ఉంటారని.. అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటామన్నారు జంగా రాఘవ రెడ్డి. వరంగల్ పశ్చిమంలో వినయ్ భాస్కర్‌కు నాకే పోటీ అంటూ ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, జంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.