లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ తన కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. కౌంటింగ్ రోజు జరిగే అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే వీడియో తీసి హెల్ప్‌లైన్ నంబర్‌కు పంపాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
READ MORE: Chandrababu: కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచనలు
ఈ మేరకు కాంగ్రెస్ ఓ లేఖ విడుదల చేసింది. “ఇది ప్రజల ఎన్నికలు. గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నట్లుగా.. బీజేపీ నాయకులు పదేపదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం, భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం వంటివి చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఈ నైతిక అవినీతి కారణంగానే ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటి నుంచి టీవీ వార్తలు, ఫలితాలు చూసే బదులు పార్టీ జిల్లాకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ కార్యాలయాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు మీ ఓట్లను కాపాడుకోవడానికి పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు సహాయపడతాయి. కాంగ్రెస్ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఓట్ల లెక్కింపులో సమస్య ఉన్న ప్రాంతాలకు పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లడానికి రవాణా ఏర్పాట్లు చేయండి. 24 గంటలూ పూర్తి సమయం పనిచేసే మానిటరింగ్ సెంటర్‌ను ఢిల్లీలో ప్రారంభించాం. కౌంటింగ్ కేంద్రంలో అనుమానాస్పదంగా ఏదైనా జరుగుతున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తే, దయచేసి దానిని మీ ఫోన్‌లో రికార్డ్ చేయండి. వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కు వీడియోను పంపండి. అటువంటి వైరుధ్యంపై అవసరమైన చర్య తీసుకోవడానికి మేము న్యాయ బృందాన్ని ఏర్పాటు చేసాం. దయచేసి వీడియోతో పాటు కౌంటింగ్ కేంద్రం, లోక్‌సభ నియోజకవర్గం పేరును పంపండి. +91 79828236, +91 9560822897 హెల్ప్ లైన్ నంబర్లకు ఏదైనా లెక్కింపు వ్యత్యాసం గురించి సమాచారాన్ని పంపండి.” అని రాసుకొచ్చారు.