NTV Telugu Site icon

Parliament Security Breach: పార్లమెంట్‌ ఘటనపై ప్రధాని ముఖం చాటేస్తున్నారు.. చర్చ అవసరమే!

Jairam Ramesh

Jairam Ramesh

Jairam Ramesh React on PM Modi comments on Parliament Security Breach: పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని మోడీ ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ అన్నారు. పార్లమెంట్‌ అలజడిపై చర్చ అవసరమే అని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై హోం మంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఇండియా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధాని స్పందిస్తూ.. ఇది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది.

ప్రధాని మోడీ స్పందనపై జైరాం రమేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన అసాధారణ ఘటనపై ప్రధాని ఎట్టకేలకు మౌనం వీడారు. విచారణ అవసరమని, చర్చ అవసరం లేదని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉంది. లోక్‌సభలో దుండగుల చర్యపై చర్చ అవసరం లేదని మోదీ అంటున్నారు. విచారణ జరిగితే సరిపోతుందట. డిసెంబరు 13న ఏమి జరిగింది, ఎలా జరిగిందనే దానిపై హోం మంత్రి వివరణ ఇవ్వాలి. చర్చకు తావివ్వకుండా ముఖం చాటేస్తే ఎలా?. దుండగులకు పాస్‌లు మంజూరు చేసిన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పాత్రపై ప్రశ్నలు తలెత్తుతాయి’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

Also Read: SA vs IND: సుదర్శన్, శ్రేయస్ హాఫ్‌ సెంచరీలు.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!

పార్లమెంటులో డిసెంబర్‌ 13న అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇద్దరు దుండగులు సందర్శకుల గ్యాలరీ నుంచి.. ఏకంగా సభలోకి దూకారు. గ్యాస్‌ను సభలో వదిలి కలకలం సృష్టించారు. ఈ ఘటనతో ఎంపీలు అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే తేరుకొని భద్రతా సిబ్బంది సాయంతో దుండగులను బంధించారు. ఈ ఘటనలో ఎవరికీ హానీ కలగలేదు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Show comments