ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Read Also: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర సమయంలో ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చాం.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నాం.. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం.. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది.. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు.. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ హామీ ఇచ్చారు.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప.. ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండని పేర్కొన్నారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు.. ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటే అన్నారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా పెంచారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలో గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.