విశాఖలోని సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి గత నెల 30న ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం విచారణ తర్వాత కమిటీ ప్రభుత్వానికి ఈరోజు నివేదిక అంధించింది. కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామ నారాయణ రెడ్డిలతో సీఎం చంద్రబాబు చర్చించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేదని.. భారీ వర్షం వల్ల పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని కమిషన్ తమ నివేదకలో పేర్కొంది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని, చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా గోడ నిర్మించారని తెలిపింది. ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారని.. డిజైన్, పునాది లేకుండానే గోడను కట్టేశారని.. గోడ సామర్థ్యం, భక్తుల భద్రత గురించి తనిఖీలు చేయలేదని చెప్పింది. విశాఖ సీపీ, సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశామని.. దుర్ఘటనకు ఆలయ ఈవో, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యాటకశాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు అని కమిషన్ తెలిపింది.