CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలీదేమో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు అని అందరికీ తెలుసన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని.. ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు.
ఆ సర్వే లేక భూములన్నీ సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామన్నారు. వాళ్ల భూముల మీద సర్వ హక్కులూ వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి, రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు.
మే 13న కురుక్షేత్ర యుద్ధం మళ్ళీ జరగబోతోందని.. ఈ యుద్ధం జగన్‌కు, చంద్రబాబుకు మధ్య కాదని.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరగుతుందన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు.. మళ్ళీ మోసపోవడమేనన్నారు. మీరేసే ఓటు ఐదేళ్ల అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయించేదని ఆయన తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. బాబును ఓడించడానికి పేదలను, విలువలను, విశ్వసనీయతను గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా అంటూ పేర్కొన్నారు. మనం చేసిన పథకాలు చూసి చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో గతంలో ఎన్నడూ చూడని విప్లవం తీసుకుని వచ్చాం కనుక చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. మూడు వేల రూపాయల పెన్షన్ కానుక, విద్యావ్యవస్థ కీలక మార్పులు విప్లవం అవునా, కాదా అని ప్రశ్నించారు. జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు….బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో ఒక్క మంచి కూడా ప్రజలకు గుర్తు లేదన్నారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు రెక్కలు కడుతున్నాడన్నారు. 14ఏళ్ల ముఖ్య మంత్రిగా వున్న చంద్రబాబు పెన్షన్ ఇంటికి తీసుకుని వెళ్లి ఇవ్వాలని ఎందుకు అనుకోలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. పెన్షన్‌ల పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది చంద్రబాబేనని.. అవ్వా తాతల నుంచి వ్యతిరేకత వచ్చే సరికి నా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.