CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 18వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరోగ్య శ్రీ డ్రైవ్ పై ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమై.. ఆరోగ్యశ్రీ కార్డుల జారీతో పాటు స్పెషల్ డ్రైవ్‌పై చర్చించనున్నారు.. ఇక, ఆ తర్వాత పౌర సరఫరాల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష కొనసాగనుంది.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.. ధాన్యం సేకరణ, తాజా మిచౌంగ్ తుఫాన్ వల్ల తడిసిన ధాన్యం సమస్య తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించనున్నారు.
Read Also: Wednesday Special: మార్గశిర మాస ప్రారంభ వేళ ఈ స్తోత్రాలు వింటే మీ తలరాత మారిపోతుంది
మరోవైపు ఈరోజు తిరుపతి వెళ్లనున్నారు సీఎం జగన్.. సాయంత్రం 5.30 నిమిషాలకు తిరుపతిలో జరగనున్న శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.. దీనికోసం మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. తిరుపతి తాజ్ హోటల్‌లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొని.. రాత్రికి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.