CM YS Jagan: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సుడాన్‌లో ఇప్పటి వరకు సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు..
కాగా, సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్), ఆర్మీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో వందలాది మంది పౌరులు చినిపోయారు.. వేలాది మంది గాయపడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు తమ పౌరులు, దౌత్య సిబ్బందిని వీలైనంత త్వరగా యుద్ధభూమి నుంచి తరలిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే తమ ఎంబసీ అధికారులను అమెరికా మిలిటరీ ఎయిర్‌లిఫ్ట్ చేసింది. తమ ఎంబసీ ఉద్యోగులు, పౌరులు, మిత్ర దేశాలకు చెందిన పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరోపియన్ దేశాలు ప్రకటించాయి. ఇక, సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. అందులో భాగంగా భారతదేశం మంగళవారం సూడాన్ ఆన్‌బోర్డ్ నావికా నౌక INS సుమేధ నుండి 278 మందిని తొలి దశలో స్వదేశానికి తీసుకొచ్చింది.. సుడాన్ నుండి సుమారు 3,000 మంది భారతీయులను తరలించడానికి ప్రారంభించబడిన న్యూఢిల్లీ మిషన్ ‘ఆపరేషన్ కావేరీ’ కింద ఎక్కువ మందిని తిరిగి తీసుకురావడానికి భారత నావికాదళానికి చెందిన రెండవ నౌక INS టెగ్ పోర్ట్ సూడాన్‌కు చేరుకుందని అధికారులు తెలిపారు.
సూడాన్ నుండి భారతీయులను సులభతరం చేయడానికి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో భారత్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. తరలింపు మిషన్‌ను పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ జెడ్డా చేరుకున్నారు. ఆపరేషన్ కావేరిలో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుండి బయలుదేరింది. 278 మంది వ్యక్తులతో INS సుమేధ జెడ్డాకు పోర్ట్ సుడాన్ నుండి బయలుదేరింది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.