CM YS Jagan: చంద్రబాబు పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు.. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అన్న స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? అని ఫైర్ అయ్యారు.. ఒక పక్షి కూడా సొంతంగా ఒక గూడు కట్టుకుని తన కుటుంబంతో ఉంటుంది.. కానీ, పేదల ఇళ్ళను అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
చంద్రబాబు, దత్త పుత్రుడు, వాళ్ళ మీడియా అమరావతిలో పేదలకు భూములు ఇవ్వకుండా అడ్డుకుంటూ వచ్చారని విమర్శించారు సీఎం వైఎస్ జగన్.. గజదొంగల ముఠా వారు మాత్రమే అమరావతిలో ఉండాలట.. ఇటువంటి సామాజిక అన్యాయం ఉంటుందా? అని నిలదీశారు. పేదలు అమరావతిలో అడుగు పెట్టకుండా చేయాలనే వికృత ఆలోచనలు గజ దొంగలవి.. అమరావతిలో పేదలకు 50 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం.. వాళ్ళకు ఇళ్ళు కట్టి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందట నిర్ణయించాం. కానీ, చంద్రబాబు అండ్ దొంగల ముఠా దానిని అడ్డుకునే యత్నం చేసింది. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.
అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26వ తేదీన స్థలాల పంపిణీ ఉంటుందని మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన ప్రకటించారు సీఎం జగన్.. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దు అంటుందా అన్నాడు చంద్రబాబు.. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఈ వర్గాలను అవమానించాడు.. బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నది చంద్రబాబే.. రూపం మార్చుకున్న అంటరానితనపు పెత్తందారీ స్వభావం అని మండిపడ్డారు.. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు. మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు. పేదలంటే చంద్రబాబుకు చులకన. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అందులో పేదలు కేవలం పాచిపనులు చేయాలంట. రోజూవారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.