NTV Telugu Site icon

CM Revanth Reddy: పదేళ్లు ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఎందుకు ఓటేయాలి..?

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్‌లో నోరు లేకపోయినా కేసీఆర్‌ను గెలిపించారని.. పాలమూరు ఎంపీగా కేసీఆర్‌ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.. తెచ్చింది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో అభ్యర్థి వంశీ నామినేషన్ ర్యాలీ పాల్గొని, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీలు కూడా కేసీఆర్ భర్తీ చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. జూరాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్న ఆయన.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి గురించి ఎప్పుడైనా పార్లమెంట్‌లో మాట్లాడారా అంటూ సీఎం ప్రశ్నించారు. మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేస్తే ఏం ఉపయోగమన్నారు.

Read Also: Ponnam Prabhakar: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం.. రూ.500 బోనస్ ఇస్తాం..

కారు ఇంజన్‌ చెడిపోయిందని.. తూకానికి అమ్ముడే అంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కారును బండకేసి కొట్టారని.. వంద మీటర్ల లోతులో బొందపెట్టారన్నారు. కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద.. తోడేళ్లలా కొట్టుకుపోతామని అనుకుంటున్నావా అంటూ ధ్వజమెత్తారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు.. మీ దగ్గర ఎవరు ఉంటరో చూడాలన్నారు. కాపలా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి.. ప్రయత్నం చేసి చూడాలని ఆయన సవాల్ విసిరారు. మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి అంటూ పేర్కొన్నారు. హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి   ఉన్నడు ఇక్కడ.. వచ్చి ముట్టుకో.. కాకిలా మాడిపోతావ్ అంటూ తెలిపారు. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత  మంది ఉంటారో లెక్క పెట్టుకోవాలన్నారు.

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..”100 రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచాం. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం.. ఆడబిడ్డలను ఆదుకుంటాం. ఇందిరమ్మ రాజ్యంలో మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. మక్తల్ , నారాయణపేట, క`డంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చాం. ఉమ్మడి జిల్లాలో అనేక విద్యాసంస్థలను తీసుకువచ్చాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 30 వేల కోట్ల కేంద్రం నుంచి రాబట్టడానికి ఒత్తిడి తీసుకువచ్చాం. పాలమూరులో కాంగ్రెస్‌ను ఓడించాలని గద్వాల నుంచి దొరసాని బయలుదేరింది. మీ గద్వాల గడీల ముందు బానిసలుగా బతకదల్చుకోలేదు.” అని సీఎం పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదు.. కానీ కట్టుబడి ఉన్నాం..!

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్‌ను చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జిల్లా నాయకులకు గుర్తింపునిచ్చామన్నారు. ఆగస్టు 15 లోగా ముదిరాజ్ బిడ్డను  మంత్రిని చేసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో కొట్లాడి వర్గీకరణ సాధించే బాధ్యత మాదేనని పేర్కొన్నారు. 30 యేళ్ల  వర్గీకరణ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, సమస్యలు పరిష్కారం కావాలన్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక్కడే పుట్టినా ,పెరిగిన, పోయినా ఇక్కడి మట్టిలో కలిసిపోతామన్నారు. నల్లమల బిడ్డగా పాలమూరుపైన తనకు ఉన్న దుఖం ఎవరికైనా ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాలమూరు బిడ్డనని.. అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. పార్లమెంటులో మన బిడ్డ ఉండాలని.. ఆలోచించాలన్నారు. నాలుగున్నరేళ్లు ఇంకా అధికారంలో ఉంటామన్నారు.

Read Also: G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..

పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ దగ్గరకు వెళ్లి బీజేపీ నేతలు పాలమూరు-రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. డీకే అరుణ గెలిచినా జిల్లాకు ఏం ఉపయోగం ఉండదన్నారు. పదేళ్లు ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఎందుకు ఓటేయాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే అన్నీ చేయాలంటున్నారని సీఎం అన్నారు. మోడీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ దెబ్బ తీయడం కోసం వెనకాల ఒకటయ్యారని అని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్‌లో ఎలాగైనా గెలుస్తాం.. అయినా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గల్లీ నుంచి కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా ఈ గడ్డ మనదన్నారు. మీ బిడ్డకు  దేశం నలుమూల నుంచి పిలుపు వస్తోందని.. దేశంలో ఈ గడ్డ గౌరవాన్ని పెంచుతానన్నారు. మహబూబ్ నగర్‌లో లక్ష మెజారిటీకి ఒక్క ఓటు కూడా తగ్గొద్దని సీఎం పేర్కొన్నారు. నాగర్ కర్నూల్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష మెజారిటీ రావాలన్నారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించాలని ప్రజలను కోరారు.

 

Show comments