ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
‘గోదావరి నదీ జలాలను మూసీ నది, ఈసా నదిలో సమ్మేళనం చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతాం. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుంది. 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లతో నిజాం సర్కార్ ఈ ప్రాజెక్టులు కట్టింది. దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాజెక్టులు కట్టడంతో నగర దాహం తీరుతోంది. నగరంలో జనాభా పెరుగుతోంది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. నగర జనాభా కోటిన్నరకు చేరింది. పీజేఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఖాళీ కుండలతో అసెంబ్లీ ముందు ధర్నాలు చేసి.. మంజీరా, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీపాద ఎల్లంపల్లి నీటిని తరలించడానికి శంకుస్థాపన చేస్తే 2014 నుంచి నగరానికి వచ్చాయి’ అని సీఎం రేవంత్ తెలిపారు.
‘అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న వ్యక్తి నగరానికి వచ్చే నీటిని నెత్తి మీద చల్లుకున్నాడు. ఆయన నీళ్ళు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వివిధ ప్రాజెక్టుల నుంచి నగరానికి నీళ్లు తీసుకువచ్చారు. 2014 నుంచి ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మేము అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్ళని తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తున్నాం. మూసీ నీళ్ళు విషంగా మారాయి. భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో విషపు నీళ్ళు పారుతున్నాయి. మూసీ నీటి వల్ల ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వస్తున్నాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. పోయిన ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారు. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం. వీటిలో 16 టీఎంసీలు తాగునీటి కోసం, మిగతా 4 టీఎంసీలతో మూసీని బాగు చేస్తాం’ అని సీఎం చెప్పారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్.. ఇంటి లొల్లులకే సరిపోతోంది!
‘ఒక వ్యక్తి తాడిచెట్టు లాగా పెరిగాడు కానీ ఏమి లాభం లేదు. గోదావరి జలాలు కాళేశ్వరం నుండి వచ్చేవే కదా అంటున్నాడు. కానీ వాళ్ళు కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి మీ తాత ముత్తాతలు కట్టలేదు. గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం. కాకా సూచన మేరకు ప్రాణహిత చేవెళ్లకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నామకరణం చేశారు. చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి వేసిన శిలాఫలకం లేదా. కానీ దాన్ని ఆపి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడాను. త్వరలో నీరుగా కలుస్తా, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కట్టడానికి సహకారం కోరుతా. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు దగ్గర 152 మీటర్ల ఎత్తులో కడతాం అని అడిగాం. 149 మీటర్లకు ఒప్పుకున్నారు. గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. చేవెళ్ల, పరిగి, వికారాబాద్ కు నీళ్ళు తీసుకువస్తాం’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.