Revanth Reddy: జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోందన్నారు. పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మతం పేరుతో చిచ్చుపెట్టి మూడోసారి అధికారం కోసం కుట్ర చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Also: Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్
హైదరాబాద్‌లో వరదలొస్తే కిషన్ రెడ్డి ఒక్క పైసా అయినా తెచ్చారా అంటూ రేవంత్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదని.. పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు, దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారన్నారు. కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తామన్నారు. పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత తమదని ఆయన హామీ ఇచ్చారు. వంద రోజుల పాలన మీ ముందందని ఆయన తెలిపారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. మా 100 రోజుల పాలన నచ్చితే 14 లోక్‌సభ సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని రేవంత్ అన్నారు.