కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్.. కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. ఇవాళ..సీతక్క… సురేఖ మంత్రులు అయ్యారన్నారు. 33 శాతం మహిళలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. మీలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపిస్తామన్నారు.
“ప్రతి మండలం లో రైస్ మిల్లులు. అవసరం మేర గోడౌన్‌లు నిర్మిస్తాం. గత పాలకులు వడ్లు ఇస్తే… బియ్యం పంది కొక్కుల లెక్క మెక్కారు. ఇకపై అలా ఉండదు.. రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు ఇస్తాం. చంద్ర గ్రహణం పోయింది. మంచి రోజులు వచ్చాయి. ఇందిరా గాంధీని అమ్మ అన్నారు. తర్వాత ఎన్టీఆర్ ను అన్నా అన్నారు. ఇప్పుడు రేవంత్ అన్న అని నన్ను అంటున్నారు అన్న.. అంటే మీ కుటుంబ సభ్యుడినే కదా. మిమ్మల్ని కోటీశ్వరుల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మహిళా సంఘాలు ఉత్పత్తులకు టాక్స్‌లు కూడా లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు టన్నెల్ కూలితే సంతోష పడుతున్నారు. పంట ఎండిపోతుంటే సంతోష పడుతున్నారు. నన్ను తిట్టడానికి ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇది పైశాచిక ఆనందం కాదా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సూచన చేయాలి. పైశాచిక ఆనందం పొందిన వాణ్ణి.. బాగుపడ్డట్టు చరిత్ర లో జరగలేదు. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం 28 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు చెక్కును అందజేశారు.
READ MORE: Hyderabad: అడ్డుగా ఉన్నారని.. ప్రియురాలి తల్లి, అక్కను కిరాతకంగా చంపిన ప్రియుడు