CM Revavnth Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD)లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, వివిధ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం, నిధుల కేటాయింపు కోసం తక్షణమే సంబంధిత మంత్రులను కలవాలని సూచించారు.
S Jaishankar: అమెరికా నుంచి భారతీయులను బహిష్కరించడంపై స్పందించిన జైశంకర్..
స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా, బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. బీసీ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి, వారికి అధికారంలో మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నేతలు, క్యాడర్ అందరూ ఒకే తాటిపై నిలిచి పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరింత దృఢంగా నిలిచేలా చేస్తుందని, అందుకే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమర్థవంతమైన ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను గట్టిగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
సమావేశం ముగింపు సందర్భంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ విజయానికి శ్రమించాలని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.