Revanth Reddy: 1980లో దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ఓటర్లు ఇందిరాగాంధీని గెలిపిస్తేనే ప్రధాని అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మెదక్ కి బీహెచ్ఎల్( BHEL) ఓడిఎఫ్ (ODF) లాంటి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పలు మార్లు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఇందిరమ్మ తెచ్చినా పరిశ్రమలే దర్శనమిస్తున్నాయన్నారు. ఇప్పుడు మాకు ఓట్లు వేయండి అని అడగడం ఆ పార్టీ నాయకులకు సిగ్గు చేటన్నారు.
రఘునందన్ దుబ్బాకలో గెలిస్తే మోదీతో కొట్లాడి వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా అన్నడని.. మేమంతా బస్సు తీసుకుని దుబ్బాక వస్తాం.. నువ్ చేసిన అభివృద్ధి ఏందో చూపించమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చేనేత పరిశ్రమలపై జీఎస్టీ (gst) తీసుకువచ్చి ఆ రంగాన్ని మోదీ ఆగం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయిందని.. కారు కూడా షెడ్డుకు పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పాత సామాన్లు కొనే వాళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. పిట్టల దొర ఇంట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అంటున్నారన్నారు. అదేమైనా ఫుల్ బాటిలా అయిపోవడానికి.. ఇక్కడ కాపలా ఉన్నది ఎవరో తెలుసా.. నువ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసి అయిపోతావని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని నువ్ మోదీ కలిసి మా ప్రభుత్వాన్ని కలిసి పడగొడతారా అని ప్రశ్నించారు.
రైతుల్ని పొట్టన పెట్టుకున్న బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోదీ నల్లధనం తెచ్చి మన ఖాతాలో వేస్తా అన్నాడు. మరి మీ ఖాతాలో వేశాడా అని ప్రజలను అడిగారు. ఎప్పటికైనా పేదవాడికి అండగా ఉండేది మూడు రంగుల కాంగ్రెస్ జెండానే అని తెలిపారు. ఒక పక్క గడీలా ఉండే దొర ఉన్నడు, మరో పక్క పెద్ద రెడ్డి ఉన్నాడు.. ఇక్కడ మాత్రం ఓ బీసీ బిడ్డ ఉన్నాడన్నారు. మల్లన్న సాగర్ బాధితుల ఉసురు పోసుకున్న వ్యక్తి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి అని ఆరోపించారు. కాసిమ్ రీజ్వి నిజామ్ రాజుకు గులాంగురి చేసిండో ఇప్పుడు వెంకట్రామిరెడ్డి కూడా కేసీఆర్ కి అలానే చేస్తున్నాడని విమర్శించారు. నమ్మిన స్నేహితుడు మదన్ రెడ్డిని మోసం చేశారని ఆరోపించారు. గడిచిన పదేళ్లు సీఎంగా కేసీఆర్, పీఎంగా మోదీ, మంత్రిగా హరీష్ రావు ఏం చేశారని ప్రశ్నించారు. వీళ్లంతా మెదక్ ను పట్టి పీడిస్తున్నారన్నారు.