అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. నియోజకవర్గ పనుల కోసం బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తనను కలుస్తున్నారని.. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరొచ్చినా కలుస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సొంత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.
‘‘పింఛన్లు 15 తారీఖులోపే పూర్తి స్థాయిలో పడతాయి. ఇకపై గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు. కాళోజీ కళాక్షేత్రం 9 ఏళ్లు అయినా పూర్తి చేయలేదు. కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేయించే బాధ్యత ప్రభుత్వానిదే. 9 నెలల్లో ప్రగతి భవన్ కట్టారు. సచివాలయం ఆగమేఘాల మీద కట్టారు. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు కట్టలేదు.’’ అని సీఎం ప్రశ్నించారు.
‘‘కాళేశ్వరం అవినీతిపై చర్చ వచ్చినప్పుడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. రూ. 97 వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు.. 90 వేల ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా..?, విజిలెన్స్ నివేదికకు అనుమతి ఇస్తే సభలో మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటుంటే నల్గొండలో సభ పెడతారంట. నల్గొండలో మోడీ ఉన్నారా? అమరుడు అయ్యేవరకు ఢిల్లీలో దీక్ష చేయండి. ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు వస్తారా?, ఎందుకు మాట్లాడలేదు అప్పుడు. ఏపీ మంత్రి రోజా ఇంట్లో పులుసు తిని సైలెంట్‌గా ఉన్నది నువ్వా మేమా?, రాయలసీమ ప్రాజెక్టుకు నీళ్లు తరలింపు బీజం పడింది మీ డైనింగ్ టేబుల్ మీదా కాదా? కృష్ణా జలాల మీద మరణశాసనం రాశారు’’ అంటూ కేసీఆర్‌పై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.