CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!

Revanth

Revanth

CM Revanth Reddy: ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 27 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం తెలిపారు. ఆరుట్లలో ప్రారంభించిన టీపీఎస్ రాష్ట్రంలోని 24 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ విద్యా నమూనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖ కోసం రూ.8,500 కోట్లను కేటాయించిందని ఆయన వెల్లడించారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

×
×
Ad

ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహలు పేద ప్రజల్లో ఉన్నాయని, ఆ నమ్మకాన్ని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశామని సీఎం వివరించారు. విద్యా కమిషన్ వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలను సందర్శించి రూపొందించిన నివేదిక ఆధారంగానే ఈ కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన “దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది” అనే భావనను స్ఫూర్తిగా తీసుకుని విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమవుతుందని, అందుకే విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని సీఎం తెలిపారు. భారీగా దరఖాస్తులు రావడంతో అడ్మిషన్లు లేవని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ విజయానికి అక్కడి ఉపాధ్యాయుల కృషే కారణమని, వారు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తాను కూడా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆరో తరగతి చదవడానికి రోజూ ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడినని చెప్పారు. తమ కుటుంబం ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ చదువుకున్నవారు లేరని, 17 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా ఎన్నో ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో కులాల మధ్య గోడలు నిర్మిస్తున్నారని, ఆ గోడలను కూల్చాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల పిల్లలు కలిసి చదివేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. విద్య ద్వారా సమానత్వాన్ని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు సాధించలేకపోతోందని అన్నారు. ఇటీవల దక్షిణ కొరియాను సందర్శించి అక్కడి క్రీడా విధానాలను అధ్యయనం చేశానని చెప్పారు. 2034 నాటికి తెలంగాణ నుంచి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులను తయారుచేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తెలంగాణకు తీసుకురావాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో కొందరు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ కిట్లు అందించేందుకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించినప్పటికీ.. కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రూ.680 కోట్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యావంతులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు.

రాష్ట్ర యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ఈ నెల 19న హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.