NTV Telugu Site icon

KTR : తెలంగాణ అభివృద్ధికి రేవంత్ ఏం చేశాడు?

Ktr

Ktr

KTR :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

“తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. కానీ, తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు,” అని విమర్శించారు. “నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది” అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై న్యాయ కమిషన్ డిమాండ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. అంతకుముందు సుంకిశాలా, పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.

ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్‌లను డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

“ప్రభుత్వం సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలి. కేంద్ర సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Mahashivratri 2025: శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది?