NTV Telugu Site icon

CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, ఇసుక రీచ్‌ల తనిఖీలు, అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల పర్యవేక్షణ, విజిలెన్స్ దాడులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

GHMC: కాంగ్రెస్ ఏడు, ఎంఐఎం ఎనిమిది నామినేషన్స్ దాఖలు

ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల సాయం అందిస్తుండగా, అదనపు ఖర్చును తగ్గించేందుకు ఇసుకను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

ఈ ఉచిత ఇసుక సరఫరా అమలు కోసం నలుగురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ, ఇసుక సరఫరా విధానం, లాజిస్టిక్స్, భవిష్యత్తులో తలెత్తే సమస్యలు మొదలైన వాటిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు అందించనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థానిక వాగులు, చెరువుల నుంచి ఇసుకను తీసుకోవడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అక్రమ రవాణా అడ్డుకట్ట తప్పనిసరి అని సీఎం పేర్కొన్నారు. అందుకే, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?