మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చిట్టిబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.
దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ జీవనాధారం అయ్యాయని సీఎం తెలిపారు. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేదని అన్నారు. భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని, ఇప్పుడు చేయగలిగింది మంచి విద్య అందించటమేనని తెలిపారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. నిబద్ధత లేని చదువు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.