CM KCR Strategy: ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈసారి గజ్వేతో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలంటూ ఆయన ఇప్పటికే మూడు సార్లు ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి రావడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్‌కు కామారెడ్డికి వీడదీయరాని అనుబంధం ఉంది. కేసీఆర్ పుట్టింది కామారెడ్డి నియోజకవర్గంలోనే. బీబీ పేట్ మండలం కొనాపూర్ సీఎం కేసీఆర్ సొంత ఊరు. ఆయన ఇదే గ్రామంలో పుట్టారు. తల్లి వెంకటమ్మ కు ముస్తాబాద్ కు చెందిన రాఘవ రావు తో ఇల్లరికం పెళ్లి చేశారు. మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం తో కొనాపూర్ ముంపు నకు గురికావడంతో.. ఊరు ఖాళీ చేసి చింత మడకకు కేసీఆర్ ప్యామిలీ మకాం మార్చింది. కేసీఆర్ పూర్వీకుల మూలాలు కామారెడ్డిలో ఉండటం పోటీకి రాజకీయంగా బలంగా ఉండటంతో.. కేసీఆర్ ఇక్కడ నుంచి పోటీకి కామారెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో దిగడం వల్ల ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల పై ప్రభావం చూపనుంది. ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ స్థానాలు సొంతం చేసుకుని ఈ ప్రాంతంలో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి చెక్ పెట్టొచ్చని వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ తో పాటు జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో అక్కడక్కడా ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీలో అసంతృ ప్తులు, గ్రూపులు వర్గ విబేధాలన్నీ సమసిపోయే విధంగా ఇది ఒక వ్యూహాత్మక మేనని అంటున్నారు పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి కామారెడ్డిలో పోటీపై కొద్ది నెలలుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ పాటికే పలు దఫాలుగా సర్వేలు చేశారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ ఫలాలు వాటి లబ్ధిదారుల వివరాలు సేకరించారు. మొత్తంమీద.. గులాబీ బాస్ కామారెడ్డిలో పోటీతో.. రాజకీయ సమీకరణాలు, పరిణామాలు మారిపోనున్నాయి.