తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెల రెండో వారం లోపు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తికావాలన్నారు. రోడ్లు ఎక్కడెక్కడ ఏమూలన పాడయ్యాయో సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజనీర్ల దగ్గర వుండాలన్నారు. ‘సాంప్రదాయ పద్దతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలె. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, వానలకు వరదలకు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలె. చెక్కు చెదరకుండా అద్దాల మాదిరి గా రోడ్లను ఉంచేందుకు నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాద్యత ఆర్ అండ్ బి ., పంచాయితీ రాజ్ శాఖలదే. ఈ దిశగా మీ శాఖల్లో పరిపాలన సంస్కరణలు అమలు చేయాలె. క్షేత్రస్థాయిలో మరింతమంది ఇంజనీర్లను నియమించుకోవాలె..’’ ఇతర శాఖల మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలన్నారు.
Also Read : Jharkhand CM Hemant Soren : ముగిసిన ఈడీ విచారణ.. 9గంటల తర్వాత బయటకు వచ్చిన సీఎం
ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు వొక ఎస్ ఈ వుండే విధంగా, ర్రిటోరియల్ సీ ఈ లను కూడా నియమించాలన్నారు. పటిష్టంగా పనులు జరగాలంటే ఎస్ ఈ ల సంఖ్య, ఈ ఈ ల సంఖ్య ఎంత వుండాలో ఆలోచన చేయాలన్నారు. శాఖలో పెరుగుతున్న పనిని అనుసరించి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేసే దిశగా పని విభజన జరగాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని సీఎం అన్నారు. ‘‘ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్ శాఖలను పటిష్టం చేసుకునేందుకు పలు మార్గాలను అనుసరించాల్సి వుంది. శాఖల్లో బాధ్యతల పునర్విభజన., వానలకు వరదలకు కొట్టుకు పోయిన రోడ్ల (ఎఫ్ డి ఆర్) ను మరమ్మత్తులు నిర్వహణ., కిందిస్థాయి ఇంజనీర్లు మరమ్మత్తులు తదితర పనులకు సత్వర నిర్ణయం తసుకుని పనులు చేపట్ట దిశగా నిధుల కేటాయింపు, వంటి మార్గాలను అవలంబించాలన్నారు.