వినాయక చవితి పర్వదినం ప్రారంభం నుంచి నేటి వరకు వాడ వాడనా గణేష్ మండపాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు,భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ సహా పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. వర్షాల నేపథ్యంలో తగు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, నిమజ్జనం కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సీఎం కేసిఆర్ సూచించారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రావడం దైవేచ్ఛ అని సీఎం అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకుంటూ తెలంగాణ ‘గంగా జమున తెహజీబ్’ ను మరోసారి ప్రపంచానికి చాటాలని రాష్ట్ర ప్రజలకు కేసీఅర్ పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. లంబోదరుని నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. పదకొండో రోజైన గురువారం జరిగే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 5 చోట్ల 36 క్రేన్లు, పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేశారు. మరో 100 చోట్ల నిమజ్జనాలు జరుగుతాయని, అన్ని ప్రాంతాల్లో క్రేన్లు, ఇతర యంత్రాలు, సిబ్బందిని విధులు కేటాయించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. శోభాయాత్ర జరిగే రహదారుల వెంట పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, నిమజ్జన సిబ్బంది, కార్మికులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతే వారిని త్వరగా రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. సాగర్ చుట్టూ వైద్య శిబిరాలు, వివిధ రహదారులపై 79 అగ్నిమాపక శాఖ వాహనాలను అందుబాటులో ఉంచారు.