ఇవాళ తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. గతేడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను సీఎం వైయస్ జగన్ జమ చేశారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తూ వారి చదువులకు పూర్తి భరోసానిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మీ పిల్లల భవిష్యత్ నా చేతిలో పెట్టండి. రెండేళ్ళ టైం ఇవ్వండి. అన్నిటినీ సరిచేస్తా. మీ పిల్లల తలరాతలు మారుస్తా అన్నారు. ‘కాలేజీల ఫీజులు ఎంతైనా సరే.. పిల్లలు ఎంతమంది చదివినా సరే.. ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడు. చదువులకు పేదరికం అడ్డురాకూడదు. మన పిల్లలు బాగా చదవాలి.. ప్రపంచంతో పోటీపడాలి.. రెండు సంవత్సరాల టైమ్ ఇవ్వండి గవర్నమెంట్ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవనే మాటను తుడిచేస్తా.. కార్పొరేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీపడేలా చేస్తా’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్–డిసెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించిన నిధులును సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. 9.86 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.698.68 కోట్లను జమ చేశారు.
తిరువూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు విద్యా దీవెన కార్యక్రమం కూడా జరుగుతుంది. నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగకుండా ఇచ్చే ఆస్తి చదువే అని గట్టిగా నమ్ముతున్నాను. అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ ఎప్పుడూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోకి ఒక మనిషి పేదరికం నుంచి బయట పడాలంటే అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.
Read Also: Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్
మనిషి తలరాతను, ఓ కుటుంబం తలరాతను, వెనకబడిన కులాల తలరాతలను, దేశ తలరాతలను కూడా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈరోజు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాల పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే, మెరుగైన జీతాలతో, ఆదాయాలతో వారి బతుకులు సాగాలంటే, వారి జీవన ప్రమాణాన్ని, వారి జీవన ప్రయాణాన్ని రెండింటినీ నిర్దేషించేది ఒక్క చదువే అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.. గర్వపడుతున్నాను. కాబట్టే మన రాష్ట్రంలో ఈ రోజు ఎల్‌కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి.. అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఆ బిడ్డ ఎదిగి ఒక మంచి డాక్టర్ కావాలని, మంచి ఇంజినీర్ కావాలని కోరుకుంటున్నాను. మన కళ్లెదుటే మన కలెక్టర్ ఢిల్లీరావు ఉన్నారు. అత్యంత సాధారణ కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఈరోజు కలెక్టర్‌గా మీ కళ్లెదుటే కనిపిస్తున్నారు. ఇలా బతుకులు మారాలి.. మన జీవితాలు మారాలని అడుగులు ముందుకేస్తున్నాం.
అలాంటి చదువులకు పేదరికం అడ్డురాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితులు ఎప్పటికీ రాకూడదు. ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నామని సగర్వంగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా, ప్రతి తమ్ముడిగా మంచి అన్నగా అని తెలియజేస్తున్నాను. ఇలాంటి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇచ్చే కార్యక్రమం. చదువులే కాకుండా.. ఆ పిల్లలను చెయ్యిపట్టుకొని నడిపిస్తూ వసతి దీవెన అనే కార్యక్రమం కూడా తీసుకువచ్చాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాల ద్వారా ఈ స్థాయిలో మంచి జరిగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. కాలేజీల ఫీజులు ఎంతైనా సరే.. పిల్లలు ఎంతమంది చదివినా సరే.. ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లలకు సంబంధించిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేసే ఈ కార్యక్రమాన్ని తిరువూరులో ప్రారంభిస్తున్నాం.
గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజుల విషయంలో ఎలా ఉండేదో మనందరికీ గుర్తుంది. ఇచ్చే ఫీజులు అరకొర.. ఫీజులు చూస్తే రూ.70 వేలు, రూ.80 వేలు, లక్ష రూపాయలు, కొన్ని కాలేజీల్లో అయితే రూ.1.20 లక్షలు కూడా ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ చూస్తే అరకొర. రూ.35 వేలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితి చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు చూశా.. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశా.. ఈ రెండింటినీ మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకువేశాం. వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్ తెచ్చాం. ఫీజులు ఎంతైనా కానీ, 60 వేలు, 70 వేలు, 80 వేలు, లక్ష రూపాయలు కానీ, రూ.1.20 వేలు కానీ, ఫీజులు ఎంతైనా కానీ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదివినా కానీ, ఆ ఫీజుల కోసం ఏ తల్లి, ఏ తండ్రి అప్పులపాలు కాకూడదు. ఆ ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసే పరిస్థితి రాకూడదు. అందుకోసమే మీకు తోడుగా నిలబడేందుకు మీ జగనన్న ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడని చెప్పడానికి గర్వపడుతున్నా.
ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజులు చెల్లించడమే కాదు.. అవి సకాలంలో చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బందులు పడకుండా చదువులు ముందుకుసాగిస్తారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ పిల్లలకు పూర్తి ఫీజులు తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 9.86లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నా ప్రసంగం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నాం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా 8,90,180 మంది తల్లుల ఖాతాల్లోకి 698 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నాం అన్నారు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా, ఎలాంటి బకాయిలూ లేకుండా పిల్లలకు నూటికి నూరు శాతం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తూ.. జగనన్న విద్యా దీవెన పథకంతో ఇప్పటి వరకు అక్షరాల రూ.9,947 కోట్లు ఇవ్వడం జరిగింది. 27 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు పాలనలో చివరి రెండు సంవత్సరాలకు సంబంధించి (2017–18, 2018–19) ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ జగనన్న ప్రభుత్వం చెల్లించిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ పెద్ద మనిషి బకాయిలు పెట్టిపోతే చిరునవ్వుతో చెల్లించింది మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా.
ఈ ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం.. ఆ తల్లులకు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు ఇవ్వడం కోసం చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీలకు వెళ్లాలని, తమ పిల్లల బాగోగులు తెలుసుకోవాలని, స్వయంగా వారే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీల్లో వసతులు లేకపోతే బాగుచేయమని యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ కార్యక్రమంలో మార్పులు చేశాం. కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్ చేస్తే నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ ఆ కాలేజీలతో మాట్లాడే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తున్నా.
పిల్లలకు పూర్తిగా ఫీజులు మాత్రమే ఇవ్వడం కాకుండా.. వారికి వసతి కోసం, భోజనం కోసం ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చులు కూడా భారమై తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు రూ.15 వేలు, మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.20 వేలు రెండు దఫాల్లో జగనన్న వసతి దీవెన కింద ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరానికి సంబంధించి రెండో దఫా కింద ఇచ్చే జగనన్న వసతి దీవెన సొమ్ము కూడా ఏప్రిల్ 11వ తేదీన విడుదల చేసేందుకు తేదీని కూడా ఖరారు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నా అన్నారు జగన్.
Read Also: Bhatti Vikramarka: ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారు