ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి బలమైన విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లు (జెడ్పీలు), మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాలను కూటమి దక్కించుకునేలా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని, ఈ విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఎం అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో లభించిన విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజల నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని వారికి, సీట్లు దక్కించుకోలేకపోయిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ.. రానున్న పరిషత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

