త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో ఇంకా 50 వేల గదులు రావాలన్నారు. దసరా ఉత్సవాల్లో కోల్‌కతా, మైసూర్ సరసన విజయవాడను చేర్చాం అని సీఎం చంద్రబాబు వివరించారు.
‘ఏవియేషన్ రంగంలోనూ ఒక యూనివర్సిటినీ విశాఖలో ఏర్పాటు చేయలని భావిస్తున్నాం. ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించాం. ఆటోమొబైల్ రంగంలో కియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో ఉత్పత్తి చేస్తోంది. 2014 -19 మధ్య కియా కార్లను ఉత్పత్తి చేయటంతో పాటు ఓ మోడల్ టౌన్ షిప్ ను కూడా అభివృద్ధి చేసింది. ఇసుజు, హీరోమోటార్స్ లాంటి సంస్థలు కూడా మా హయాంలోనే ఏపీకి వచ్చాయి. గత పాలకులు కియా మోటార్స్ యాంక్సిలరీ యూనిట్లను వేధిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. జాకీ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు. 2019-24 మధ్య పెట్టుబడి దారుల్లో నమ్మకం పోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేకుండా పోయింది. పీపీఏలు రద్దు చేశారు. మీ వల్ల దేశం క్రెడిబిలిటీ పోయింది అని కేంద్రం వ్యాఖ్యానించింది. ప్రజల పన్నులతో కట్టిన డబ్బులను విద్యుత్ వినియోగించుకోకపోయినా.. వాళ్లకు ఊరకే చెల్లించాల్సి వచ్చింది. సింగపూర్ వాళ్లను కూడా ఇబ్బంది పెట్టారు. ఏపీ బ్రాండ్ దెబ్బతింది, ఏపీపై నమ్మకం పోయేలా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఏపీపై విశ్వాసాన్ని పెంపోందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పెట్టుబడులు పెట్టాక అది రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి త్వరితగతిన అనుమతులు ఇచ్చి వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తున్నాం. వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణఆంధ్ర లక్ష్యంగా విజన్ రూపోందించాం. 2.4 ట్రిలియన్ ఎకానమీ, 450 బిలియన్ ఎగుమతులు, తలసరి ఆదాయం లాంటి లక్ష్యాలను పెట్టుకున్నాం. అలాగే వందశాతం అక్షరాస్యత, 95 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులను సాధించటం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుగుణంగా పాలసీలు తీసుకువచ్చాం. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే నీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే నీటిభద్రత విషయంపైనా దృష్టి పెట్టాం. ఈ లక్ష్యాల సాధనకు ఏం చేయాలన్న దానిపైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రొడెక్టు పర్ఫెక్షన్ నుంచి సర్క్యులర్ ఎకానమీ వరకూ వివిధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. విశాఖలో రూ.1కి భూమి ఇస్తామంటే కొందరు వ్యతిరేకించారు. ఏడాదిలోనే టాప్ రేటెడ్ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ను 6 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతోంది. టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. పోర్టు సిటీ, స్టీల్ సిటీ నుంచి నాలెడ్జ్ ఎకానమీ సిటిగా విశాఖ రూపు రేఖలు మారబోతున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు.
Also Read: Botsa Satyanarayana: బాలకృష్ణ మామూలుగా ఉన్నాడా?.. ఆ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం!
‘ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 10 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు జరిగాయి. తద్వారా రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6.29 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గత పాలకులు ఐదేళ్ల కాలంలో నిర్వహించిన సమావేశాలు కేవలం 13 మాత్రమే. ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే మూడు రెట్ల మేర పెట్టుబడులు సాధించాం. 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, ఎల్జీ, ఐబీఎం, టీసీఎస్, గూగుల్, ఎన్టీపీసీ, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి’ అని సీఎం వివరించారు.
