Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు!

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజని అన్నారు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటితో స‌రిగ్గా ఏడాది గ‌డించింది. ఈ సందర్భంగా సీఎం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

‘జూన్ 4.. ప్రజా తీర్పు దినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’ అని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Also Read: Virat Kohli: ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండాలనుకోను.. ఇక ఎక్కువ రోజులు ఆడలేను!

‘ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి.. సంక్షేమాన్ని అందిస్తూ, అభివృద్ధి పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాము. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్’ అని సీఎం రాసుకొచ్చారు.

Exit mobile version