అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రీ సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంబాజీపేటలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. నీరు జీవం అయితే, భూమి జీవితం అని పేర్కొన్నారు. కోనసీమ అంటే పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి పరవళ్లు గుర్తుకు వస్తాయని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులు వచ్చినా గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలవడం ఆ జీవనది గొప్పతనానికి నిదర్శనమని సీఎం చెప్పారు.
పాలన అంటే సచివాలయంలో కూర్చోవడం కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెల నాలుగు సార్లు ప్రజల మధ్యకు వెళ్తున్నానని, తనతో పాటు ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించిన సీఎం.. పూర్వీకులు ఇచ్చిన పాస్ పుస్తకాలపై ప్రభుత్వ నేతల ఫొటోలు ముద్రించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగించే గ్రానైట్ రాళ్లను పొలాల్లో ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని, భూమికి పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను తొమ్మిదోసారి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని పేర్కొన్న సీఎం.. ఒక్క రూపాయి అవినీతికి కూడా తావులేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ss

