గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రైతు కూలీలతో వెళుతున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మహిళలు మృతి చెందటం బాధాకరమన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ‘కూలీ పనులకోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్ర కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. బుడంపాడు-బాపట్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. బుడంపాడు రోడ్డును బాపట్ల సమీపంలో జాతీయ రహదారి 214కు అనుసంధానం చేయాల్సిన ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ప్రతి నిత్యం 22 వేల భారీ వాహనాలు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము, కేంద్రం వద్ద పెన్డింగ్లో ఉన్నాయి. కేంద్ర మంత్రి సహకారంతో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల చెప్పారు.
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.