Bhatti Vikramarka: మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా వెంటనే స్పందించిన మీ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన.. ఈ రోజు డిండీ నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎక్కడైనా భూములు కోల్పోతే.. వారికి అన్యాయం చేయకుండా 2013 అనే ఓ చట్టాన్ని తీసుకొచ్చి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందులో స్పష్టంగా పొందుపర్చామని.. నిర్వాసితులకు భూములు సేకరించిన సమయంలో ఉన్న ధరలకు అనుగుణంగా ఇవ్వాలని ఆ చట్టం చెబుతుంది.. ఇల్లు కోల్పోతే ఇల్లు.. ఊరు పోతే ఊరు మొత్తం నిర్మించేలా ఆ చట్టంలో ఉంది.. ఆ చట్టాన్ని సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనంగా లేదన్నారు.. అసలు మేం తెలంగాణలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అనే ప్రశ్నించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
తాను ఆదిలాబాద్‌లో చేపట్టిన పాదయాత్ర ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లకు చేరుకుందని తెలిపారు సీఎల్పీ నేత భట్టి.. ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఆనందంగా ఉన్నారు తప్ప.. ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.. దీనిని ఎవ్వరూ ఆపలేరు.. కేసీఆర్, హరీష్‌రావు.. వారి తాతలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునే పరిస్థితి లేదన్నారు. నేను ఆదిలాబాద్ నుంచి చేస్తున్న పాదయాత్రలో ఎంతో మంది ప్రజల స్పందనను చూసే ఈ మాట చెబుతున్నాను.. ప్రాజెక్టుల నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇక, ధరణిలో లోపాల గురించి మాట్లాడితే.. వారిని బంగాళాఖాతంలో కలిపేస్తారని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. ఎన్నో ఏళ్లుగా భూముల రికార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. రికార్డుల ప్రకారం అందరికీ న్యాయం చేస్తూ వచ్చాం.. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులను సర్వనాశనం చేసి.. కోట్లాది విలువైన భూములను కొట్టేయాలన్న ఉద్దేశంతోనే ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ధరణి ముసుగులో దేశంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాన్ని బయటపెడుతుందని వార్నింగ్ ఇచ్చారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.
