Bhatti Vikramarka: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 19వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. పోలంపల్లి నుంచి గంగినపల్లి వరకు కొనసాగిన పాదయాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున జైపూర్ కు వచ్చి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం పలికి మద్దతు ప్రకటించారు. జైపూర్‌లో భట్టి పాదయాత్రలో అడుగులు అడుగులు వేస్తూ గంగినపల్లి వరకు కదం తొక్కారు. జైపూర్‌లో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కొత్తగూడెం ఫేస్ వన్ నుంచి ఫేస్ 5 వరకు, భూపాలపల్లి, ఎన్‌టీపీసీ తదితర ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుల నుంచి తయారయిన తీగల్లో ప్రవహించే కరెంటును అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని చెబుతాయన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేకపోయిందని భట్టి విమర్శించారు. ఒక్క మెగా పవర్ కానీ ఒక్క మెగా యూనిట్ కానీ ఉత్పత్తి చేయకుండా ఉచిత కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పడం విడ్డూరమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి పవర్ ప్రాజెక్టు వల్లనే ఉత్పత్తి అవుతున్న కరెంటును తామిస్తున్నామని గొప్పలు చెప్పడం విచారకరమని వ్యాఖ్యానించారు. 53.49 శాతం కరెంటును ఆంధ్ర కంటే తెలంగాణకు ఎక్కువగా రాష్ట్ర విభజన చట్టంలో సోనియా గాంధీ చేర్చడం వలన పక్క రాష్ట్రాల నుంచి కూడా కరెంటు వస్తోందన్నారు. సొమ్ము ఒకొడిది సోకొకరిది అని, తగువనమ్మ అన్నట్టుగా 24 గంటలు కరెంటు తామే ఇస్తున్నామని కాకి అరుపులు అరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడంతో పాటు మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ కరెంట్ ఇచ్చామన్నారు. దళిత గిరిజనులకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చామన్నారు.
Read Also: SSC Paper Leak: పదో తరగతి పేపర్ లీక్ కేసు.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కుర్చి వేసుకొని ఓపెన్ కాస్ట్‌లు మూసివేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి ఓబీ, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లను ఆంధ్రా బడా బాబుల కంపెనీలకు ధారాదత్తం చేస్తూ స్థానికుల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 60 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు చెన్నూరుకు శాపంగా మారిందన్న భట్టి విక్రమార్క.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు వరదలు వచ్చినప్పుడు వేల ఎకరాలు మునిగిపోతూ చెన్నూరు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌కు రిటైనింగ్ వాల్ కట్టాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. గొల్లవాగు కాలువలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చెన్నూరు, భీమారం మండలాల్లో వేల ఎకరాలు బీడు భూములుగా మారాయన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తే చెన్నూరు సస్య శ్యామలం అయ్యేదన్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో చెన్నూరు నియోజకవర్గం ఉండటానికి బీఆర్ఎస్ విధానాలే కారణమన్నారు. ప్యూడల్ విధానాన్ని తిరిగి తీసుకువచ్చ తెలంగాణను 60 ఏళ్ల కిందికి తీసుకువెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శలు గుప్పించారు. ధరణి తీసుకువచ్చి భూస్వాములకే తిరిగి భూములను కేసీఆర్ ప్రభుత్వం అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. పొలంపల్లి గ్రామంలో దొరలకు వెట్టిచాకిరి చేసిన పాలేరులకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఆ భూములను తిరిగి తీసుకొని వెట్టిలోకి నెట్టివేసిందని బాండెడ్ కాలనీ ప్రజలు ఆవేదన చెందారని ఆయన ఆరోపణలు చేశారు.
