Chittoor: చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇప్పటి వరకు జిల్లాలో 380పైగా కేసులు నమోదయ్యాయి.. స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు 6-30% వరకు నమోదు కావొచ్చు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండడం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడంలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్‌లలో అనుమానిత పరీక్షలు చేస్తున్నారు. ఇవికాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు 17 జిల్లాల్లోనే ఉన్నాయి. అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో.. నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేస్తే ఫలితం ఉంటుంది.
READ MORE: Russia-India: “దోస్త్ మేర దోస్త్”.. పుతిన్ పర్యటనకు ముందు భారత్‌కు రష్యా బిగ్ గిఫ్ట్..