NTV Telugu Site icon

Chiru-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలసి నటించాల్సిందే!

Balakrishna

Balakrishna

Chiru-Balakrishna: ఓ వైపు అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమా వెలుగులు విరజిమ్ముతూ ‘ట్రిపుల్ ఆర్’ బృందం విజయ విహారం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తెలుగువారికే తలవంపులు తెచ్చేలా వినలేని మాటల యుద్ధంతో తమ హీరోల సినిమాలకు ప్రచారం చేసుకుంటున్నారు. నిస్సందేహంగా ఇది అనారోగ్యకరమైన వాతావరణం! చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ అన్నది కొత్తేమీ కాదు 1984 నుండీ సాగుతోంది. ఈ పోటీలో కొన్నిసార్లు బాలయ్యది పైచేయి అయితే, మరికొన్నిసార్లు చిరంజీవి పైచేయిగా సాగారు. అంత మాత్రాన వారిద్దరూ శత్రువులు కారు. పైగా టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఇప్పటికీ సక్సెస్ రూటులో సాగుతోన్న సీనియర్స్ వారిద్దరే! అందువల్ల మన తెలుగువారి గౌరవం పరిఢవిల్లేలా ఈ ఇద్దరు స్టార్ హీరోస్ దేశవిదేశాల్లో ఉన్న తమ అభమానులకు హితబోధ చేసి, ఏ పోటీనైనా స్పోర్టివ్ గా తీసుకోవాలని చెబితే సంస్కారవంతంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. మరి విదేశాల్లో సైతం చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య గొడవ సాగిన సంగతి ఈ ఇద్దరు హీరోలకు తెలుసునో లేదో కానీ, వారి దృష్టికి వస్తే తప్పకుండా స్పందిస్తారనీ మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా వారి అభిమానుల మాటల యుద్ధం కారణంగా ఈ ఇద్దరు హీరోల పరువుతో పాటు తెలుగువారి ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని విదేశాల్లో ఉన్న తెలుగువారు భావిస్తున్నారు.

Chiranjeevi-Balakrishna: ఆరేళ్ళ తరువాత చిరు, బాలయ్యకు సేమ్ సీన్!

నిజానికి నవతరం హీరోల నడుమ మంచి పోటీ ఉంది. అందువల్ల వారి సినిమాలు విడుదలైనప్పుడు ఫ్యాన్స్ ఇలా గొడవలు చేసుకోవడం పరిపాటే! ఆశ్చర్యంగా 39 ఏళ్ళ నుంచీ పోటీపడుతోన్న చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఇప్పటికీ మాటల యుద్ధాలు సాగుతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ ఇద్దరు హీరోల ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోస్ జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ లాగే వీరూ కలసి నటించాలని అసలైన తెలుగు భాషాభిమానులు ఆశిస్తున్నారు. అదీగాక, చిరంజీవి బావ అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న ‘ఆహా’ ఓటీటీ వేదికపై బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అరవింద్ ను బాలకృష్ణ ప్రశ్నిస్తూ, ‘నాతో సినిమా ఎందుకు తీయలేదని’ అడిగారు. అందుకు అరవింద్ కూడా తనదైన రీతిలో ‘మీరు, చిరంజీవితో కలిపి పాన్ ఇండియా మూవీ తీద్దామని అనుకున్నా’ అని చెప్పడం, అందుకు బాలయ్య, ‘అప్పుడది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది’ అని అనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, బాలకృష్ణ అసలైన అభిమానులు వారిద్దరూ కలసి నటిస్తే చూడాలని ఆశిస్తున్నారు. అలా వారిద్దరూ కలసి నటిస్తే, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి జనానికీ తెలిసిపోతుందని, అప్పుడు వారి ఫ్యాన్స్ లోనూ దురభిమానం తరిగి సయోధ్య కుదురుతుందని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి కలసి నటిస్తే- నిస్సందేహంగా ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని విశేషంగా అలరిస్తుందనీ తెలుగు సినీ అభిమానులు ఆశిస్తున్నారు. వారిద్దరూ నటించే సినిమా- ఓ పాట, ఓ ఫైట్, ఓ కామెడీ సీన్… అంటూ సాగే ఫార్ములాలో కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తే ‘ట్రిపుల్ ఆర్’లాగా అంతర్జాతీయ యవనికపై మన తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచవచ్చు అన్నది తెలుగు సినీ అభిమానుల భావన. మరి ఈ అభిమానుల అభిలాషను గురించి చిరంజీవి, బాలకృష్ణ కూడా ఓ సారి ఆలోచిస్తే మంచిది. ఎటూ నిర్మాతగా ఇద్దరికీ కావలసిన అల్లు అరవింద్ ఉండనే ఉన్నారు. దర్శకత్వం వహించడానికి ఎనభై ఏళ్ళు దాటిన కె.రాఘవేంద్రరావు మొదలు ఈ నాటి నవతరం దర్శకుల వరకు ఎందరో సిద్ధంగా ఉంటారు. ఏమంటారు?

Show comments