ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై హోం వర్క్ భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చట్టం ద్వారా తీసుకురాబోయే నిబంధనలను అమలు చేసే బాధ్యతను స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఈ చట్టం ద్వారా గుర్తుచేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పిల్లలకు ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఈ చట్టం ద్వారా ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం మంచి ఫలితాలను ఇస్తుందని చైనాకు చెందిన విద్యాపండితులు విశ్లేషిస్తున్నారు.
Read Also: కరోనా కారణంగా తగ్గిపోయిన భారతీయుల ఆయుష్షు
ఇటీవలే పిల్లలు తప్పు చేస్తే పెద్దలను శిక్షించేలా కొత్త చట్టాన్ని చైనా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా అధికారులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పటికి కూడా పిల్లలు మారకపోతే తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి ఒకవేళ తల్లిదండ్రులు హాజరుకాకపోతే 156 డాలర్ల జరిమానా, 5 రోజుల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడే విషయంలో చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్ల వయసులోపు వారు వారంలో మూడుగంటలు మాత్రమే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవాలి. శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అంటే గంటపాటు చిన్నారులు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు.