మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే కూరగాయలలో మిర్చి కూడా ఒకటి.. అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
నారు కుళ్ళు తెగులు..
చిన్న మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. మొలకెత్తిన వెంటనే ఒకసారి మరలా వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.. అప్పుడే కుళ్ళు తెగులు తగ్గుతుంది..
చిగురు కుళ్ళు తెగులు..
ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్ళు మరియు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి.. ఆకులు ఎండిపోతాయి.. ఈ తెగులు చాలా ప్రమాదం పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి..
తెల్ల నల్లి..
తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.. దీని నివారణ కోసం పంటకు ఒక లీటరు డైనోఫాల్ ను కొట్టడం మంచిది..
తామర పురుగులు..
రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్ లేదా స్పైనోశాడ్ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలి..
పేను బంక..
పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. నివారణకు ఎకరానికి మిథైల్‌డెమటాన్ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు చేయాలి. పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. సరైన సమయంలో దీన్ని కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలి లేకుంటే తీవ్ర నష్టమే..