Mailardevpally Wall Collapse: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు సహా చిన్నారుల తల్లిదండ్రులు స్పందించారు.
ఎన్టీవీతో డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ‘బాబుల్ రెడ్డి నగర్‌లో ఉదయం 10:30 గోడ కూలి ఇద్దరి చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మాకు సమాచారం అందగానే వెంటనే 11 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నాం. రెస్క్యూ చేసి ముగ్గురు చిన్నారులను కాపాడాం. ముగ్గురి తలకు గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమం ఉంది. ఈ ఘటనపై ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. బీహార్, ఒడిశాకు చెందిన రెండు కుటుంబాలు బాబుల్ రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇరు కుటుంబాల చిన్నారులు ఘటనలో బాధితులుగా ఉన్నారు. స్థానికంగా ఓ కంపెనీలో బాధిత కుటుంబం పని చేస్తున్నాయి’ అని తెలిపారు.
Also Read: T20 World Cup 2024: తస్మాత్ జాగ్రత్త.. ఆటగాళ్లను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్!
‘మా చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా గోడ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేము ప్రమాదం జరిగిన సమయంలో బయట పనిలో ఉన్నాము. మా ఇద్దరి చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకుని ఘటనస్థలికి చేరుకునే లోపే మా చిన్నారులు మృతి చెందారు. పోలీసులు శిఖరాల కింద చిక్కుకున్న చిన్నారులను వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి కురిసిన చిన్న వర్షానికి గోడ తడిసి కుప్పకూలింది. నాణ్యత లేకుండా నిర్మించిన గోడే ఈ ప్రమాదానికి కారణం’ అని చిన్నారుల తల్లిదండ్రులు రోదిస్తున్నారు.